భారతదేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా “ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన” (PM Dhan-Dhaanya Krishi Yojana) అనే పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 2025 జులై 16న ప్రధాని ‘నరేంద్ర మోదీ’ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది.
భారత ప్రభుత్వంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న 36 పథకాలను సమ్మిళితం చేసి ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ ను అమలు చేస్తారు. ఆ పథకాలన్నిటికి కలిపి ప్రతి సంవత్సరం ఖర్చు చేసే రూ. 24,000 కోట్లను కొత్తగా అమలు చేయబోయే పథకానికి కేటాయిస్తారు. 2025-26 ఆర్ధిక సంవత్సరం నుంచి 6 సంవత్సరాలపాటు ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ అమల్లో ఉంటుంది.
ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ పథకానికి ఎంపిక చేస్తారు. ఉత్పాదకత, సాగు విస్తీర్ణం, రుణ వినియోగం … ఈ మూడు అంశాలు తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి మిగతా జిల్లాలతో సమానంగా పైకి తీసుకురావడానికి చేయూతను అందిస్తారు. ఈ పథకం ద్వారా ఒక కోటి డెబ్భై లక్షల మంది రైతులకు ప్రయోజనం లభిస్తుందని కేంద్ర మంత్రి ‘అశ్వినీ వైష్ణవ్’ విలేకరులకు తెలిపారు. డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి నెలవారీగా ఈ పథకాన్ని విశ్లేషిస్తారు. నీతి ఆయోగ్ (NITI AAYOG) కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి జిల్లాలకు మార్గనిర్దేశం చేస్తుంది.
ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన : ప్రధాన ఉద్దేశ్యాలు
దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో ఈక్రింద తెలియజేసిన ప్రధాన ఉద్దేశ్యాలను సాధించాలనే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ అనే పథకాన్ని అమలు చేయబోతున్నారు.
- పంట ఉత్పాదకత పెంచడం
- పంటల మార్పిడి
- సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం
- పంచాయితీ, మండల స్థాయిల్లోనే పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచడం
ఉత్పాదకతను పెంచడానికి సాగునీటి సదుపాయాలు, స్వల్ప-దీర్ఘకాల రుణ వితరణను పెంచనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన : కమిటీలు
‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ ను సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తారు.
జిల్లా ధనధాన్య సమితి … జిల్లా స్థాయి వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల ప్రణాళికను ఖరారు చేస్తుంది. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, అభ్యుదయ రైతులు సభ్యులుగా ఉంటారు. పంటల వైవిధ్యం పాటించడంతోపాటు నీరు, భూసార సంరక్షణ, వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు.
ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన : FAQ
(1) ప్రశ్న : ప్రతి జిల్లాలో ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ పథకం పురోగతిని ఎన్ని ముఖ్యమైన సూచికల ఆధారంగా లెక్కిస్తారు ?
జవాబు : 117.
(2) ప్రశ్న : ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ పథకం అమలు కోసం ఎన్ని జిల్లాలకు ఒక కేంద్ర నోడల్ అధికారి ఉంటారు ?
జవాబు : ప్రతి జిల్లాకు ఒక కేంద్ర నోడల్ అధికారి ఉంటారు.



