‘అన్నదాత సుఖీభవ’ (Annadatha Sukhibhava) అనే పథకం ద్వారా సొంత భూమి ఉన్న రైతులతోపాటు కౌలు రైతులకు కూడా సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో రూ. 20,000 అందజేస్తారు. ‘పీఎం కిసాన్‘ కింద ఇచ్చే రూ. 6,000 తో కలిపి ఈ మొత్తాన్ని జమచేస్తారు.
అటవీ భూములపై హక్కు (ROFR) కలిగిన వారు కూడా ‘అన్నదాత సుఖీభవ’ అనే పథకం ద్వారా సహాయం పొందడానికి అర్హులే.
ప్రభుత్వ సిబ్బంది ధృవీకరించిన అర్హుల జాబితాను ‘అన్నదాత సుఖీభవ‘ వెబ్ సైట్ (https://annadathasukhibhava.ap.gov.in/) లో నమోదు చేస్తారు.
అన్నదాత సుఖీభవ : మార్గదర్శకాలు
- భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబం యూనిట్ గా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేస్తారు.
- పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్ గా పరిగణిస్తారు.
- వ్యవసాయ, ఉద్యాన, పట్టు కు సంబంధించిన పంటల సాగుదారులకూ పథకం వర్తిస్తుంది.
అన్నదాత సుఖీభవ : అనర్హులు
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ది పొందడానికి ఈక్రింది వారు అనర్హులు.
- ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.
- తాజా, మాజీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు.
- ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, జడ్పీ చైర్ పర్సన్లు తదితర రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించిన/నిర్వహించే వారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారు. (మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్-4, గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు)
- నెలకు రూ. 10,000, అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు.
- వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, నమోదైన ఇతర వృత్తి నిపుణులు.
- గత సంవత్సరంలో పన్ను చెల్లించినవారు.
వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మారిస్తే ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా లబ్ది పొందడానికి వీలుండదు.