ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ (AP SC Sub-Classification Ordinance-2025) కు రాష్ట్ర మంత్రివర్గం 2025 ఏప్రిల్ 15న ఆమోదం తెలిపింది. తర్వాత గవర్నర్ కార్యాలయానికి నివేదించగా, ఏప్రిల్ 16న గవర్నర్ ఆమోదించారు. దీంతో ఏప్రిల్ 17న అధికారికంగా ‘ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్-2025’ కి సంబంధించిన గెజిట్ (జీవో 19) నోటిఫికేషన్ ను న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి విడుదల చేశారు.
2025 ఏప్రిల్ 17 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడే నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీ, కేంద్రం ఆధీనంలో ఉండే కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, విద్యాసంస్థలకు మాత్రం ఇది వర్తించదు.
2024 ఆగష్టు నెలలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంటూ .. ఆయా వర్గాల వెనుకుబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పలు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించింది. వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, పథకాల అమలు తీరును పరిశీలించింది. 5 నెలలపాటు కూలంకష అధ్యయనం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి 360 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది.
AP SC Sub-Classification Ordinance-2025 : 59 ఉప కులాలకు ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నింటికీ విద్య, ఉద్యోగాల్లో సమాన, న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మొత్తం 15% రిజర్వేషన్లను 3 భాగాలుగా ఏకసభ్య కమిషన్ విభజించింది.
AP SC Sub-Classification Ordinance-2025 : 3 Groups
గ్రూప్-1 కింద రెల్లి, ఉపకులాలు (12 కులాలు) చేర్చి 1% రిజర్వేషన్, గ్రూప్-2 కింద మాదిగ, ఉపకులాలు (18 కులాలు) చేర్చి 6.5% రిజర్వేషన్, గ్రూప్-3 కింద మాల, ఉపకులాలు (29 కులాలు) చేర్చి 7.5% రిజర్వేషన్ కేటాయించింది. దీంతో ఎస్సీల్లోని 59 ఉపకులాలకు లబ్ది చేకూరనుంది. ఈప్రక్రియకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్నారు. రాష్ట్రం యూనిట్ గా అమలు చేయనున్నారు. తదుపరి జనాభా లెక్కల తరవాత ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్ గా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
AP SC Sub-Classification Ordinance-2025 : ముఖ్య తేదీలు
- 2024 ఆగస్టు 1 : ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా.
- 2024 నవంబర్ 7 : ఎస్సీ వర్గీకరణ అమలుకు కార్యాచరణ ప్రకటన.
- 2024 నవంబర్ 15 : రాజీవ్ రంజన్ మిశ్ర ఏకసభ్య కమిషన్ నియామకం.
- 2025 మార్చ్ 10 : ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణ.
- 2025 మార్చ్ 20 : కమిషన్ నివేదికకు శాసనసభ ఆమోదం.
- 2025 ఏప్రిల్ 14 : జాతీయ ఎస్సీ కమిషన్ నుండి సంబంధిత దస్త్రం రాష్ట్ర ప్రభుత్వానికి రాక.
- 2025 ఏప్రిల్ 15 : ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం.
- 2025 ఏప్రిల్ 16 : ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం.
- 2025 ఏప్రిల్ 17 : ఆర్డినెన్స్-2025 గెజిట్ విడుదల.
AP SC Sub-Classification Ordinance-2025 : మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలను 2025 ఏప్రిల్ 18న సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ఇతర సంస్థల్లో ప్రతిపాదిత ఎస్సీ వర్గీకరణ తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని ప్రతిపాదించింది.
- ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 1/3% రిజర్వేషన్లు మూడు కేటగిరీల్లోనూ అమలవుతాయి.
- నోటిఫికేషన్ లేదా రిక్రూట్మెంట్ సమయంలో అర్హులైన అభ్యర్థులు లేకపోతే తదుపరి నోటిఫికేషన్ లేదా రిక్రూట్మెంట్ కు ఆ ఖాళీలు బదిలీ అవుతాయి.
- బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలోనూ 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని వర్తింపజేయాలి. ఇందులోనూ మహిళలకు 33 1/3% రిజర్వేషన్ ను కొనసాగించాలి.
- ప్రతి శాఖ 200 పాయింట్ల రోస్టర్ రిజిస్టర్ ను తప్పకుండా నిర్వహించాలి.
- రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోని అన్ని విద్యాసంస్థల ప్రవేశాల్లోనూ వర్గీకరణ వర్తిస్తుంది.