‘పీఎం విద్యాలక్ష్మి’ (PM Vidyalaxmi) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఏ పేద విద్యార్ధి చదువుకు దూరం కాకూడదని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి పూచీకత్తు, హమీదారులు లేకుండా నేరుగా బ్యాంకుల ద్వారా రుణ సహాయం ఇప్పించడమే ‘పీఎం విద్యాలక్ష్మి’ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం చాలా కాలంగా అందుబాటులో ఉన్నా ఎక్కువ మందికి ఆవగాహన లేకపోవడంతో పలువురు విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం 2024-25 నుంచి 2030-31 వరకు ‘పీఎం విద్యాలక్ష్మి’ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేవారు సైతం ఈ పథకానికి అర్హులుగా ప్రకటించారు.
అర్హతలు
- ఇంజినీరింగ్, వైద్య, వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చును.
- కుటుంబ వార్షికాదాయం రూ. 4 లక్షల లోపు ఉండాలి.
- ఒకసారి మాత్రమే దరఖాస్తుకు వెసులుబాటు ఉంటుంది.
- దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గడువు లేదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
‘పీఎం విద్యాలక్ష్మి’ వెబ్ సైట్ (https://pmvidyalaxmi.co.in/) లోకి వెళ్లి విద్యార్ధి పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, చిరునామా తదితర వివరాలు నమోదు చేయాలి.
పది, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితా, చివరిసారి చదివిన కోర్సుకు సంబంధించిన పత్రాలు, ప్రస్తుతం చదవాలనుకుంటున్న కోర్సులకు చెందిన ప్రవేశపత్రం, ఆదాయ ధ్రువపత్రాలు జత చేయాల్సి ఉంటుంది.
రుణం మంజూరు
అర్హులుగా ప్రకటిస్తే మూడు విడతల్లో రుణం మంజూరు చేస్తారు. మొదటి విడతలో రూ. 4 లక్షలు, రెండో విడతగా రూ. 4 నుంచి రూ. 5 లక్షలు, మూడో విడతగా రూ. 5 నుంచి రూ. 7 లక్షలు అందిస్తారు. రుణం మంజూరు అవ్వకపోతే కారణాలతో 15 రోజుల్లో ఈమెయిల్ కు సందేశం వస్తుంది.
దరఖాస్తుదారు వార్షిక ఆదాయం, తీసుకున్న రుణాన్ని బట్టి 3% వడ్డీ రాయితీ కల్పిస్తున్నారు.



